![]() |
![]() |
వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రలు ఇప్పుడు సినిమాలకు మంచి కథా వస్తువులుగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరు ప్రముఖుల జీవితం ఆధారంగా కొన్ని సినిమాలు రూపొంది ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ‘అజెయ్.. ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. టైటిల్ పాత్రను అనంత్ జోషి పోషించారు. సినిమాలో ప్రధాన పాత్ర పేరును అజయ్ మోహన్‌సింగ్‌గా మార్చారు. ఈ చిత్రానికి రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించగా, యోగి గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందర్నీ ఆకర్షించింది. ఆగస్ట్ 1న పలు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే చివరి దశలో సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఈ చిత్ర నిర్మాత ముంబాయి కోర్టును ఆశ్రయించారు. ఆగస్ట్ 1న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన విచారణ జరగనుంది.
ఎనిమిదేళ్ళ క్రితం శాంతను గుప్తా రచించిన ‘ది మాంక్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్’ అనే పుస్తకం ఆధారంగా ‘అజెయ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. 8 ఏళ్లుగా ప్రజాదరణ పొందుతున్న పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని చేశామని కోర్టుకు తెలిపారు దర్శకనిర్మాతలు. ఈ పుస్తకంపై ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు దాని ఆధారంగా తెరకెక్కిన సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని సెన్సార్ బోర్డును ప్రశ్నించింది కోర్టు. పుస్తకం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు జరగనప్పుడు సినిమాకి మాత్రమే ఎందుకు అభ్యంతరం చెప్పారో సమాధానం చెప్పాలంటూ సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది కోర్టు. కేవలం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసి సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిందని నిర్మాత తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమాను సర్టిఫికెట్ రాని కారణంగా నిలిపివేశారు. బుక్ మై షోలో ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చెయ్యలేదు. దీనికి సంబంధించిన విచారణ శుక్రవారం జరగనున్న నేపథ్యంలో ఏ క్షణమైనా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ దేశవ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. దీంతో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమా వస్తోందంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మరి ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో, బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూడాలి.
![]() |
![]() |